కావ్యాలు తాము పుట్టిన కాలం యొక్క సామాజిక పరిస్థితులను తెలియజేస్తాయి. నాటి ఆచార వ్యవహారాల గురించి సమగ్రంగా వివరిస్తాయి. జాతి జీవన పురోగతికి ఇవి దిశా నిర్దేశాలు కావడంతో వాటిని ప్రజలు అనుసరిస్తుంటారు. ఆచారాలు ఎప్పటివైనా, వాటిలోని మంచి చెడులను విశ్లేషించుకుంటూ, కొత్త పోకడలను రూపుదిద్దుకుంటూ సాగుతారు. ఇది చరిత్రలో ఓ అంతర్భాగం. ఆ చరిత్ర గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలంటే కావ్య పఠనం తప్పనిసరి. అందుకే జాతి నిర్మాణంలో కీలక పాత్ర వహించే కావ్యాల గురించి తెలుసుకున్నట్టే కావ్య రచనా కర్తలైన కవుల గురించి కూడా తెలుసుకోవడం ఎంతైనా అవసరం. ఆ ఉద్దేశంతోనే ఆంధ్ర జాతికి అక్షర రూపంలో అంతులేని విజ్ఞానాన్ని అందించిన కవుల వివరాలను అందిస్తున్నాం.
తొలితరం కవులు :
నన్నయ:
నన్నయ 11వ శతాబ్దానికి చెందిన చాళుక్య కాలమునాటి కవి. రాజమహేంద్రవరములోని రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి. రాజరాజ నరేంద్రుని కోరిక మేరకు అతడు సంస్కృత భారతాన్ని తెనిగించ పూనుకున్నాడు. తెలుగు భాషలో కావ్య రచనకు తగిన భాష లేని ఆ కాలంలో నన్నయ ప్రజల వాడుకలో ఉన్న తెలుగు భాషా పదాలను సమీకరించి ఆ పదాలను కావ్య భాషకు సరిపోయేట్టు చేయడానికి "ఆంధ్ర శబ్ద చింతామణి" అను తెలుగు వ్యాకరణ గ్రంధాన్ని సంస్కృతంలో రచించాడు. కావ్య రచనకు కావలసిన భాషను తయారుచేసుకుని మహాభారత అనువాదానికి పూనుకున్నాడు. [ఇంకా... ]