స్త్రీ అనగానే సమాజంలోని మనుషుల మనస్తత్వాలనుబట్టీ, కవుల ఊహా కల్పనలను అనుసరించి వాస్తవ అవాస్తవాలకు అనుగుణంగా ఆడదనీ, అబల అనీ కొన్ని సందర్భాలలో వక్కాణించగా మరి కొన్ని సందర్భాలలో ధైర్యసాహసాలకు చిరునామాగా, రాజ్యాలనేలు చక్రవర్తినిగా అభివర్ణించడం జరిగింది. శారీరకంగా ఆమె బలహీనురాలైనప్పటికీ మానసికంగా మహా బలవంతురాలు. ముఖ్యంగా సాహిత్యపరంగా తీసుకుంటే పూర్వకాలం నుంచీ నేటివరకూ ఎందరో సాహితీ రంగాన మల్లెలు పూయించారు. తమ రచనా సౌరభాలతో తెలుగు సాహితీ సీమను పరిమళింపజేశారు.
తెలుగులో కవిత్వం రాసిన తొలి తరం కవయిత్రులలో తాళ్ళపాక తిమ్మక్క, మొల్లలను ప్రధానంగా పేర్కొనవచ్చు. చాటువులు చెప్పిన వారిలో ఖడ్గ తిక్కన భార్య చానమ్మ, అతని తల్లి పోలమ్మ ఉన్నారు. ఈ చాటువులను క్రీ.శ.1260 ప్రాంతాల్లో చెప్పారు. తాళ్ళపాక తిమ్మక్క 1460 ప్రాంతాలకు చెందినది. తరువాత క్రీ.శ. 1630 ప్రాంతాల్లో విజయరాఘవ నాయకుని ఆస్థాన కవయిత్రి పసుపులేటి రంగాజమ్మ రామాయణ, భాగవతాలకు సంగ్రహాలు వ్రాసింది. "ఉషా పరిణయం"ను ప్రత్యేక పద్య కావ్యంగా వ్రాసిన వాళ్ళలో మొదటి రచయిత్రి రంగాజమ్మ. [ఇంకా... ]