వారణాసిని బ్రహ్మదత్తుడు పరిపాలిస్తున్నాడు. బోధిసత్వుడతనికి మంత్రిగా ఉండేవాడు. రాజపురోహితుడు వట్టి వాగుడుకాయ. అతను ఇంకొకరికి మాట్లాడే అవకాశమే యివ్వకుండా పటపటవాగుతూ డబ్బా కొట్టేవాడు. అది రాజుకీ ఇతరులకీ కూడా దుర్భరంగా ఉండేది. అతని నోరు ఎవరు మూయించగలరా అని ఎదురుచూస్తున్నాడు రాజు.
ఆ కాలంలోనే వారణాసిలో ఒక కుంటివాడుండేవాడు. కాళ్ళు వంకరయినా రాళ్ళు విసరడంలో బహునేర్పరి. పిల్లలతనిని బండిలో కూర్చోబెట్టి ఊరి చివర నగరద్వారం వద్దకు తీసుకుపోయేవారు. అక్కడొక పెద్దమర్రిచెట్టుండేది. పిల్లలు వాడికి డబ్బులిచ్చి మర్రి ఆకులను మట్టివుండలతో కొట్టి ఆ ఆకులలో ఏనుగు బొమ్మో, గుర్రం బొమ్మో తెప్పించమనేవారు. కుంటివాడు గులకరాళ్ళు విసిరి మర్రిఆకు చెట్టుమీదుండగానే ఆకారం తెప్పించి అప్పుడు దానిని రాలగొట్టేవాడు. అది పిల్లలకు ఆట. అలా రాల్చిన ఆకులు నేలమీద గుట్టగా పడివుండేవి. [ఇంకా... ]